Tuesday, 28 April 2015

చిత్రలేఖనానికే మకుటంలేని మహా రాజు
సృష్టికర్త “రాజా రవివర్మ”...

ఆయన గీసే గీత, కుంచె నుండి జాలువారే ప్రతీ చిత్రం ఒక అద్భుతమైన సుందర రూపమే... ఎవరైనా ఆయన గీసిన ఒక్క చిత్రాన్ని చూస్తే చాలు, చాలా సేపటివరకు ఆ చిత్రాన్ని చూస్తూనే ఉండిపోతాం. అలాంటి చిత్రాలు గీయాలంటే అది కేవలం రవివర్మ లాంటి వారి వల్లే సాధ్యం. మహాభారతం, రామాయాణాల్లోని ఘట్టాలను అందమైన చిత్రాలుగా గీసిన అద్భుత కళాకారుడాయన. మన సంప్రదాయాల మాటునే యూరోపియన్‌ స్టైల్‌ ను చొప్పించిన ఘనత వర్మ సొంతం. చీర కట్టుకునే స్ర్తీ సౌందర్యావిష్కరణలో ఆయన చిత్రాలు ముందు వరుసలో నిలుస్తాయి. భారతదేశ చిత్రలేఖన చరిత్రలో ఆయన స్థానం చిరస్మరణీయం. భారత దేశ పికాసోగా పేరుపొందిన "రాజా రవివర్మ" పుట్టినరోజు నేడు. ఆయన గురించి కొన్ని విషయాలు...

రాజా రవి వర్మ భారతీయ చిత్రకారుడు. అతను రామాయణ, మహాభారతాలలోని ఘట్టాలను చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు. భారతీయ సంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు. చీరకట్టుకున్న స్ర్తీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతనికి అతనే సాటి. 1873 లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది. భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవి వర్మ, 1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మృతి చెందారు. ఈయన మరణించే నాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవట. ఆ తరువాత వాటిని అధికారికంగా తిరువనంతపురంలోని చిత్రా ఆర్ట్‌ గ్యాలరీకి అందజేశారు.రాజా రవివర్మ కేరళలో తిరువనంతపురానికి 25 మైళ్ల దూరంలోని కిలమానూరు రాజపస్రాదంలో ఉమాంబ తాంబురాట్టి, నీలకంఠన్‌ భట్టాద్రిపాద్‌ దంపతులకు ఏప్రిల్‌ 29, 1848న జన్మించాడు. చిన్నతనంలోనే ఇతను చూపిన ప్రతిభ వలన ఇతనిని, ట్రావెన్కూర్‌ మహారాజా అయిల్యమ్‌ తిరునాళ్‌ చేరదీసి ప్రోత్సహించాడు. అక్కడి ఆస్థాన చిత్రకారుడయిన శ్రీ రామస్వామి నాయుడు శిష్యరికం చేశాడు.

తైల వర్ణ చిత్రకళను బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్‌ జెన్సన్‌ వద్ద నేర్చుకున్నాడు. పాశ్ఛ్యాత్య చిత్రకళలోని శక్తి, కొట్టొచ్చినట్లున్న భావ వ్యక్తీకరణ, రవివర్మను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అవి భారతీయ చిత్రకళాశైలికి ఎంతో భిన్నంగా కనిపించాయి. 1873 వియన్నా చిత్ర ప్రదర్శనలో మొదటి బహుమతి పొందిన తరువాత రవివర్మ బాగా వెలుగులోకి వచ్చాడు. ఆయన తన చిత్రాల ఇతివృత్తాల కోసం భారత దేశమంతటా పర్యటించాడు. తరచుగా ఆయన హిందూ దేవతా స్ర్తీల చిత్రాలను దక్షిణ భారత స్ర్తీలలాగా ఊహించి చిత్రించేవాడు. వారు ఎంతో అందంగా ఉంటారని ఆయన భావించేవారు. ముఖ్యంగా మహాభారతంలోని నలదమయంతుల, శకుంతలాదుష్యంతుల కథలలోని ఘట్టాలను చిత్రాలుగా చిత్రించి ఎంతో పేరు సంపాదించాడు. రాజా రవివర్మ తరువాత నుండి భారతీయుల ఊహల్లో పౌరాణిక పాత్రలన్నీ రవివర్మ చిత్రాలలాగా మారిపోయాయి. రవివర్మ తరచుగా తన చిత్ర శైలిలో ప్రదర్శనాత్మకంగానూ, ఛాందసంగానూ ఉంటాడన్న విమర్శలను ఎదుర్కొన్నాడు. అయినా అతని పనితనం దేశంలో ఎంతో ప్రశస్తి చెందింది.

వర్మపేర పురస్కారం…
రాజా రవివర్మ చిత్రకళకు చేసిన మహోన్నత ఉపకారానికిగానూ కేరళ ప్రభుత్వం ఆయన పేరిట రాజా రవివర్మ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఈ పురస్కారం ప్రతి ఏటా కళలు, సంస్కృతి అభ్యున్నతికి విశేష కృషి చేసిన వారికి ఇస్తుంది. కె.జి.సుబ్రహ్మణియన్‌, ఎమ్‌.వి.దేవన్‌, ఎ.రామచంద్రన్‌, వాసుదేవన్‌ నాయర్‌, కనై కున్హిరామన్‌, వి.ఎస్‌.వల్లిథాన్‌ లాంటి వారు ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో ఉన్నారు. రాజా రవివర్మ పేరిట కేరళలోని మావలికెరలో ఒక ఫైన్‌ఆర్ట్‌‌స కళాశాలను కూడా నెలకొల్పారు. రవివర్మపై గల ఆసక్తితో సినిమా, వీడియోలలో కూడా అతని చిత్రాలను ఉపయోగించుకుంటున్నారు.రాజా రవివర్మకు మావలికెర రాజ కుటుంబానికి చెందిన రాణీ భాగీరథీబాయి(కోచు పంగి అమ్మ)తో వివాహం జరిగింది.

వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు రామవర్మ కూడా చిత్రకారుడే. ఇతనికి శ్రీమతి గౌరీ కుంజమ్మతో వివాహం జరిగింది.ఈమె దీవాన్‌ పి.జి.ఎన్‌.ఉన్నిథాన్‌ చెల్లెలు. రెండవ వాడు రాజరాజవర్మ. పెద్ద కుమార్తె రాకుమారి మహాప్రభ(ట్రావెన్‌కూర్‌ రాణీ సేతులక్ష్మీబాయి తల్లి). ఈమె రవివర్మ వేసిన రెండు చిత్రాలలో కన్పిస్తుంది. రెండవ కుమార్తె ఉమాబాయి. రవివర్మ సంతానంతోటే మావెలికెర రాజ కుటుంబం ఏర్పడింది. ఇంకా ఆయన మనుమరాండ్లు ఇద్దరు మావలికెర రాజ కుటుంబానికి దాయాదులయిన ట్రావెన్కోర్‌ రాజ కుటుంబానికి దత్తత వెళ్లారు. వారిలో రాణీ సేతులక్ష్మీబాయి కూడా ఉంది. వారి సంతానమే ఇప్పటి ట్రావెన్‌కూర్‌ రాజ కుటుంబం.

పేరు తెచ్చి చిత్రాలు…

  • పల్లె పడుచు 
  • అలోచనలో మునిగిపోయిన స్ర్తీ
  • దమయంతి హంస సంవాదం
  • వాద్యకారుల బృందం
  • సుభద్రార్జునులు
  • లేడీ విత్‌ ఫ్రూట్స్‌
  • హార్ట్‌ బ్రోకెన్‌
  • స్వర్బత్‌ ప్లేయర్‌
  • శకుంతల
  • శ్రీ కృష్ణ రాయబారం
  • రావణ జటాయు వధ
  • ఇంద్రజీత్‌ విజయం
  • బిక్షకుల కుటుంబం
  • లేడీ ప్లేయింగ్‌ స్వర్బత్‌
  • గుడి వద్ద దానాలు ఇస్తున్న స్ర్తీ
  • వరుణుని జయించిన రాముడు
  • నాయర్ల స్ర్తీ
  • శృంగారంలో మునిగిన జంట
  • కీచకుని కలవటానికి భయపడుతున్న ద్రౌపది
  • శంతనుడు మత్స్యగంధి
  • ప్రేమలేఖ రాస్తున్న శకుంతల
  • కణ్వుని ఆశ్రమంలోని బాలిక(ఋషి కన్య)


విశేషాలు…
మనం ఈ రోజు పూజిస్తున్న దేవతా ముర్తులందరికీ ఓ రూపం ఇచ్చింది రవివర్మ. ఆ కేరళ చిత్ర కారుడి కుంచెకు ప్రేరణ ఇచ్చింది ఓ మహారాష్ట్ర యువతి సుగుణాబాయి. ఆమెను మోడల్‌గా చేసు కొనే లక్ష్మి, సరస్వతి, సీత, దమయంతి, లాంటి చిత్రాలకు ప్రాణం పోశారట. అప్పటికే పెళ్లయిన రవివర్మ ఆమెతో ప్రేమలో పడ్డారట. దీంతో సమాజం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారట.1904లో అప్పటి వైస్రాయ్‌ లార్డ్‌ కర్జన్‌ రవివర్మ పతిభను గుర్తించి ‘రాజా’ అన్న బిరుదును ప్రదానం చేశారట.

వర్మపై పుస్తకాలు…
రాజా రవివర్మ, ముద్రింపబడిన హిందూ దేవతలు, ఎర్విన్‌ న్యూ మేయర్‌, క్రిస్టీన్‌ స్కెల్బెర్గెర్‌.న్యూ ఢెల్లి,ఆక్సో్ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ 2003. రాజా రవివర్మ, ప్రఖ్యాతి గాంచిన భారతీయ చిత్రకారుడు 1848-1906, క్లాసిక్‌ కలెక్షన్‌, వాల్యూమ్‌ 1, 2. పర్సు రామ్‌ మంఘా రామ్‌, బెంగుళూరు 2005. రాజా రవివర్మ : చిత్రకారుని ముఖచిత్రం, డెయిరీ ఆఫ్‌ సి.రాజరాజవర్మ, ఎడిటెడ్‌ బై ఎర్విన్‌ న్యూ మేయర్‌, క్రిస్టీన్‌ స్కెల్బెర్గెర్‌. న్యూ ఢెల్లి, ఆక్సో్ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌2005. దేవుని చిత్రకళ, ఎన్రికో కాస్టెల్లి, గియోవాన్ని ఏప్రిల్‌. న్యూ ఢీల్లి. ఇల్‌ తామ్బురోపార్లాన్టి డాక్యుమెన్టేషన్‌ సెంటర్‌, ఎథ్నోగ్రాఫిక్‌ మ్యూసియమ్‌ 2005. ఫొటోస్‌ ఆఫ్‌ గాడ్స్‌,ది ప్రింటెడ్‌ ఇమేజ్‌ అండ్‌ పొలిటికల్‌ స్ట్రగుల్‌ ఇన్‌ ఇండియా.బై క్రిస్టోఫర్‌ పిన్నె,లండన్‌,రీక్షన్‌ బుక్‌.
మళయాళంలో...
రాజా రవివర్మయు, చిత్రకళయు, కిలమానూర్‌ చంద్రన్‌, కేరళ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ప్రచురణ 1999. చిత్రమెళుదు కొయితంబురాన్‌, పి.ఎన్‌.నారాయణ పిళ్ళై. 
రాజా రవివర్మ,ఎన్‌.భాస్కరన్‌ నాయర్‌.

తాత్విక దృష్టి…
రవివర్మ తాత్విక దృష్టి గురించిన వివరాలు తెలియవు. ముఖ్యంగా పాశ్ఛ్యాత్య చిత్రకళా శైలి మీద అతని అవగాహన గురించి తెలియదు. రవివర్మ చిత్రకళపైన తీక్షణమయిన పరిశోధన చేసే వారికి రవివర్మ రాసిన ఎటువంటి పుస్తకాలూ లేకపోవటంతో వారి పరిశోధన అసంపూర్తిగా మిగిలిపోతోంది. కాని రవివర్మ తమ్ముడు, సి.రాజరాజవర్మ రాసిన దినచర్య ఎంతో ఉపయోగపడుతోంది. సి.రాజరాజవర్మ స్వతహాగా మంచి పేరున్న చిత్రకారుడు. ఆయన రవివర్మకు చిత్రాలు చిత్రించడంలో సహాయం చేసేవాడు, అతని ఆంతరంగిక సహాయకుడు.

రవివర్మపై విమర్శలు…
రవివర్మ తనదైన శైలిలో చిత్రించిన చిత్రాలను వివిధ రకాల ఉపయోగాల కోసం విపరీతంగా ముద్రించటంతో, భారతీయ ఇతిహాసాలను తనదైనశైలిలో చిత్రించడంతో సంప్రదాయ భారతీయ చిత్ర కళా శైలి మరుగున పడిపోయిందనే విమర్శను ఎదుర్కొన్నాడు. ఆయన చిత్రకళను సంప్రదాయశైలి కోసం విద్యలాగా నేర్చుకోవలసినదే అనే భావనకు ఊతమివ్వడం ద్వారా ఒక్కదెబ్బతో శైలిపరంగా, ఇతివృత్తపరంగా చురుకైనది, గొప్పదైనదయిన భారతీయ చిత్రకళను బలహీనపరిచాడని దాస్‌ గుప్తా అభిప్రాయం. అది తప్పు అని చెప్పడానికి సరైన ఉదాహరణలుగా దాస్‌ గుప్తా మధుబని జానపద చిత్రకళను, పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాదేవి మూర్తులను చూపించారు. రవివర్మ చిత్రాలలో ఖచ్చితంగా ఇటువంటి చురుకైన భావవ్యక్తీకరణ లోపించింది.పౌరాణిక పాత్రల రూపకల్పనలోని పౌరాణిక సూత్రాలను విస్మరించటం (ఉదాహరణకు విష్ణు ధర్మోత్తర పురాణంలోని, చిత్రసూత్ర) ద్వారా రవివర్మ గొప్పవైన పౌరాణిక నాయకులను, సామాన్య మానవుల స్థాయికి దిగజార్చాడు. అవే భావనలు, వివిధ ప్రసార సాధనాలకు (సినిమా,దూరదర్శని) పాకిపోయాయి. ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా అయిన దాదాసాహెబ్‌ ఫాల్కే కూడా రవివర్మ చిత్రాల వల్ల ప్రభావితమైనవాడే కావడం విశేషం.

-క్రిష్
శిల్పి: వుడయార్ రాజ్ కుమార్ గారు